భారత్ తో వన్డే సిరీస్ కు సంగక్కర అనుమానమే!
శ్రీలంక స్టార్ బ్యాట్స్ మన్ కుమార సంగక్కర వెన్నునొప్పితో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. దీంతో, భారత్ తో ఐదు మ్యాచ్ ల వన్డే సిరీస్ కు అతడి రాక అనుమానంగా మారింది. భారత పర్యటనను మధ్యలోనే ముగించుకుని విండీస్ ఆటగాళ్ళు వెనుదిరగడంతో బీసీసీఐ లంకను ఆహ్వానించింది. వరల్డ్ కప్ కు పెద్దగా సమయం లేకపోగా, ఇప్పటికిప్పుడు భారత్ తో సిరీస్ ఎందుకని సంగక్కర ట్వీట్ చేయడం తెలిసిందే. వరల్డ్ కప్ కోసం ప్రత్యేకంగా ఫిట్ నెస్ కార్యక్రమం నడుస్తుండగా, దాన్ని మధ్యలో ఆపేసి, భారత్ తో వన్డేలు ఆడడం అవసరమా? అని సంగా ప్రశ్నించాడు.
అయితే, శ్రీలంక క్రికెట్ బోర్డు మాత్రం భారత్ తో సిరీస్ కు కట్టుబడి ఉన్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. ఒకవేళ సంగక్కర తప్పుకుంటే, అతని స్థానాన్ని వికెట్ కీపర్ నిరోషన్ డిక్వెల్లాతో గానీ, ఎడమచేతి వాటం బ్యాట్స్ మన్ కిథుర్వాన్ వితంగేతో గానీ భర్తీ చేస్తామని శ్రీలంక చీఫ్ సెలెక్టర్ సనత్ జయసూర్య తెలిపారు.